Search

నోకియా నూతన సీఈఓగా రాజీవ్ సూరి నియామకం

రాజీవ్ సూరిని నోకియా అధ్యక్షుడు మరియు ముఖ్య కార్యనిర్వహణా అధికారి (సీఈఓ)గా నియమిస్తున్నట్లు నోకియా సంస్థ ఏప్రిల్ 29,2014న ప్రకటించింది.

Apr 30, 2014 12:00 IST
facebook IconTwitter IconWhatsapp Icon

భారత సంతతికి చెందిన రాజీవ్ సూరిని నోకియా అధ్యక్షుడు మరియు ముఖ్య కార్యనిర్వహణా అధికారి (సీఈఓ)గా నియమిస్తున్నట్లు నోకియా సంస్థ ఏప్రిల్ 29,2014న ప్రకటించింది. రాజీవ్ సూరి, ప్రస్తుత చీఫ్ స్టీఫెల్ ఎలాప్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజీవ్ సూరి ప్రస్తుతం నోకియా సొల్యూషన్స్, నెట్‌వర్క్ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
 
మైక్రోసాఫ్ట్‌కు నోకియా మొబైల్ ఫోన్స్ వ్యాపారాన్ని విక్రయించిన తర్వాత ఆ కంపెనీకి పూర్తిస్థాయి సారథిగా భవిష్యత్తు వృద్ధి పథానికి రాజీవ్ సూరి దిశానిర్దేశం చేయనున్నారు. నోకియా నెట్‌వర్క్ పరికరాల యూనిట్- సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్స్(ఎన్‌ఎస్‌ఎన్)కు ప్రస్తుతం హెడ్‌గా ఉన్న రాజీవ్ సూరి, మే 1,2014 నుంచి ప్రెసిడెంట్, సీఈఓగా కొత్త బాధ్యతలను చేపట్టనున్నారని నోకియా ఒక ప్రకటనలో పేర్కొంది.
 
7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా హ్యాండ్‌సెట్ బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్ దక్కించుకున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇక ప్రధానంగా వైర్‌లెస్ నెట్‌వర్క్ పరికరాల వ్యాపారంలో ఎరిక్‌సన్, చైనా దిగ్గజం హువాయ్ వంటి హేమాహేమీలతో పోటీపడేందుకు సిద్ధపడుతోంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా నోకియా నెట్‌వర్క్స్ వ్యాపారంతో అనుబంధాన్ని కలిగి ఉన్న రాజీవ్ సూరి, 2009లో ఎన్‌ఎస్‌ఎన్ అధిపతిగా బాధ్యతలు చేపట్టకముందు తన పర్యవేక్షణలో ఎన్నో వ్యూహాలు, విలీనాలు, కొనుగోళ్లు, అమ్మకాలు, మార్కెటింగ్ కార్యకలాపాల్లో భాగం పంచుకున్నారు.

ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అధినేతగా తెలుగువ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తుండగా, ఇప్పుడు నోకియా అధిపతిగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి కొలువుదీరడం విశేషం.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS