Search

అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన హిందుస్థాన్ మోటార్స్

అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని మే 25, 2014న నిలిపివేస్తున్నట్లు వీటిని తయారుచేసే హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ప్రకటించింది.

May 26, 2014 12:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

దేశీ ఆటోమొబైల్ రంగంలో ఒక వెలుగువెలిగిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని మే 25, 2014న నిలిపివేస్తున్నట్లు వీటిని తయారుచేసే హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ప్రకటించింది. అమ్మకాలు ఘోరంగా పడిపోవడం, డిమాండ్ లేకపోవడం, రుణభారం తీవ్రతరం కావడం వంటి కారణాలవల్లే తయారీని నిలిపివేస్తున్నారు. ఈ నిర్ణయంతో పశ్చిమబెంగాల్‌లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్‌ ఉత్పత్తి నిలిచిపోతుంది. దేశీయంగా ఉత్పత్తి అయిన తొలి కారుగా అంబాసిడర్ గుర్తింపు పొందింది.

బ్రిటన్‌కు చెందిన మోరిస్ ఆక్స్‌ఫర్డ్ కారు డిజైన్ ఆధారంగా, 1957 నుంచి దేశంలో అంబాసిడర్ కార్లను హిందుస్థాన్ మోటార్స్ తయారుచేస్తుంది. అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1958లో మొదలైంది.

ఆంబి అనే ముద్దుపేరుతో ప్రాచుర్యం పొందిన అంబాసిడర్ కార్ హుందాతనానికి ప్రతిరూపంగా నిలిచింది. ఆకట్టుకునే రూపం, శక్తివంతమైన ఇంజిన్, భద్రతపై భరోసా, ఇవన్నీ అంబాసిడర్‌ కార్ ప్రత్యేకతలు. 1980లలో ఏటా 24000 వరకూ అంబాసిడర్ కార్లు అమ్ముడుకాగా, 2000 సంవత్సరం తర్వాత ఈ సంఖ్య 6000కు పడిపోయింది. ప్రత్యర్థి కార్ల కంపెనీల నుంచి పోటీ విపరీతంగా పెరిగిపోవడం దీని మూసివేతకు గల ప్రధాన కారణం.

హిందూస్తాన్ 10 పేరుతో హిందుస్తాన్ మోటార్స్ తొలి అంబాసిడర్‌ను ఉత్పత్తి చేసింది. భారత రోడ్లకు రారాజుగా అంబాసిడర్‌ను అభివర్ణిస్తారు. ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనక వైపు డ్రమ్ బ్రేక్‌లు కారణంగా ఈ కారు ప్రయాణం అత్యంత భద్రమైనది. సౌకర్యంగా కూర్చునేలా విశాలమైన సీట్‌లు ఉండటం ఈ కారు ప్రత్యేకత. సంవత్సరాల తరబడి డిజైన్ అలాగే ఉన్నా, ఇంటీరియర్ ఇతరత్రా పలు మార్పులను అంబాసిడర్ చేసింది. డాష్‌బోర్డ్‌లు, టెయిల్ లైట్లు, పార్కింగ్ లైట్లు ఇందులో కొన్ని.

అంబాసిడర్ కార్ల వైఫల్యం

అంబాసిడర్ కార్లలో మోరిస్ ఆక్స్‌ఫర్డ్ నుంచి అంబాసిడర్ ఎన్‌కోర్‌వరకూ ఎన్నో మోడళ్లు వచ్చాయి.  ట్యాక్సీగా అంబాసిడర్ కారు చాలా ప్రాచుర్యం పొందింది. కానీ 1990లలో అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో అంబాసిడర్ కార్ల ప్రాభవం మసకబారడం మొదలైంది.

1980 వరకూ భారత్‌లో అమ్ముడయ్యే ప్రతీ కారు అంబాసిసిడరే కావడం విశేషం. ఆ తర్వాత మారుతీ సుజుకి కంపెనీ చౌక ఖరీదు గల మారుతీ 800 కారు రాకతో అంబాసిడర్ కారు ప్రాభవం తగ్గింది.

స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల(ఎస్‌యూవీ) హవాతో సీనియర్ బ్రూరోక్రాట్లు, రాజకీయ నాయకులు సైతం అంబాసిడర్‌ను వదిలేసి, బిఎండబ్ల్యూ కార్లవైపు మొగ్గుచూపారు. 2003లో, భారత ప్రధాని యొక్క కార్ల శ్రేణిని అంబాసిడర్ నుంచి బిఎండబ్ల్యూకు మార్చడం అంబాసిడర్ సంస్థకు మరో నష్టంగా మారింది. గత 60 ఏళ్లలో కారు డిజైన్‌లో పెద్దగా మార్పులేవీ చేయకపోవడం అంబాసిడర్ కార్ల వైఫల్యానికి పెద్ద కారణం.

హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్

హిందుస్థాన్ మోటార్స్ (హెచ్ఎం) లిమిటెడ్ కంపెనీని 1942లో బిఎం బిర్లా గుజరాత్ లోని ఒఖా రేవుపట్టణంలో ప్రారంభించారు. హిందుస్థాన్ మోటార్స్ (హెచ్ఎం) 1948లో తన అసెంబ్లీ ప్లాంటును ఒఖా పట్టణం నుండి పశ్చిమబెంగాల్ లోని ఉత్తరపారకు తరలించింది.

సికె బిర్లా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ భారతదేశ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యింది. ఇది అంబాసిడర్, కాంటెస్సా మరియు యుటిలిటీ వాహనాలైన ట్రేకర్, పోర్టర్ పుష్పక్ కార్లను తయారుచేసింది. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచంలో బెడ్ఫోర్డ్ ట్రక్కుల మాన్యుఫాక్చర్ భాగాలను తయారుచేసే ఏకైక సంస్థగా నిలిచింది.

ప్రముఖ టాప్‌గేర్ ప్రోగ్రామ్‌లో అన్ని ప్రఖ్యాతిగాంచిన కార్లను తోసిరాజని అంబాసిడర్, టాప్ ట్యాక్సీ కార్‌గా నిలిచింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS